తెలంగాణ శాసనసభ సమావేశాలు ఏడోరోజు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సభలో బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం ఇస్తున్నారు. సామాజిక సమానత్వంలో భాగంగా బడ్జెట్‌లో కేటాయింపులు జరిపామని తెలిపారు. తెలంగాణలో ఆర్థిక, సామాజిక అసమానతలు ఉన్నాయని.. అసమానతలు తొలగించేందుకు బడ్జెట్‌లో కృషి చేశామని చెప్పారు. గతంలో బడ్జెట్‌లో కేటాయింపుల మేరకు నిధులు అందని పరిస్థితి ఉండేదని.. అలాంటి పరిస్థితి రాకుండా పథకాలు, హామీల మేరకు వాస్తవ బడ్జెట్ రూపొందించామని స్పష్టం చేశారు.
“గతంలో ఏటా బడ్జెట్‌ను 20 శాతం పెంచుకుంటూ పోయారు. వాస్తవాలను విస్మరించి గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ మేరకు ఆదాయం, వ్యయం ఉండాలని మా ఆలోచన. బడ్జెట్ కేటాయింపులకు 5 శాతానికి మించి తేడా లేకుండా చూడాలి. గతంలో తెలంగాణ బడ్జెట్ రూ.3 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ రూ.2.75 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టాం. ఈసారి బడ్జెట్ తగ్గిస్తున్నారని చాలా మంది అడిగారు. ఆదాయం, వ్యయం మేరకు బడ్జెట్ ఉండాలనేది మా ఆలోచన.” అని భట్టి విక్రమార్క వెల్లడించారు.