తెలంగాణలో చలి గజగజ వణికిస్తోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా పొగమంచు తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో ఉదయం వేళ పొగమంచు కమ్ముకునే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో మంచు కురుస్తుందని వెల్లడించింది.
రాష్ట్రం వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి దిగువ స్థాయిలో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల దాకా పొగ మంచు వీడదని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొగ మంచు కురిసే సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిదని చెప్పారు. ముఖ్యంగా వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మరోవైపు గురువారం ఆదిలాబాద్‌లో సాధారణం కన్నా 2.7 డిగ్రీలు అధికంగా 31.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. భద్రాచలం, హైదరాబాద్, మెదక్, నల్గొండలలో సాధారణం కన్నా స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గాయని పేర్కొంది.