పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో లాభం ఎంత ఉందో అంతకుమించిన నష్టాలైతే ఉంటున్నాయి. ఏఐతో పెను ముప్పు వాటిల్లే అవకాశముందని ఇప్పటికే టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక రోబోటిక్స్తోనూ చాలా రకాల సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. కార్ల తయారీ సంస్థ టెస్లా ఫ్యాక్టరీలో ఓ ఇంజినీర్పై రోబో దాడి చేసిన తాజాగా వెలుగులోకి వచ్చింది.
కార్ల తయారీలో సహాయ పడేందుకు రూపొందించిన రోబో- ఇంజినీర్పైనే దాడి చేసిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. సాంకేతిక లోపాల వల్ల ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇంజినీర్కు తీవ్ర గాయాలయ్యాయని తెలిసింది. ఈ ఘటన ఆస్టిన్లోని గిగా టెక్సాస్ ఫ్యాక్టరీలో రెండేళ్ల క్రితం జరగగా ఆలస్యంగా తాజాగా వెలుగులోకి వచ్చింది.
గిగా టెక్సాస్ కార్ల ఉత్పత్తి పరిశ్రమలో అల్యూమినియం భాగాలను బిగించేందుకు రోబోను వినియోగిస్తుండగా ఈ రోబోలో లోపం తలెత్తింది. తనకు ప్రోగ్రామింగ్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్పైనే రోబో దాడి చేసింది. పరిశ్రమలో ఉన్న మూడు రోబోలను ఆఫ్ చేస్తుండగా ఒక రోబో ఇంజినీర్ను బలంగా పట్టుకుని, అతడి వీపు, చేతులపై దాడి చేసింది. రోబో నుంచి తప్పించుకున్న ఇంజినీర్ ప్రమాదవశాత్తు పక్కన ఉన్న అల్యూమినియం భాగాలను కోసే యంత్రంలో పడిపోయాడు. తోటి ఉద్యోగులు గమనించి అతణ్ని ఆస్పత్రికి తరలించారు.