గత నాలుగైదు రోజులుగా రంగారెడ్డి శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో అటవీ శాఖ అధికారులకు చుక్కలు చూపిస్తున్న చిరుతపులి ఎట్టకేలకు బోనులో చిక్కింది. దాదాపు 5 రోజుల పాటు చిరుత కోసం అధికారులు గాలింపు చేపట్టారు. 5 బోన్లు, 20 కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా ఉంచారు. ఐదు రోజుల కఠోర గాలింపు తర్వాత చిరుత ఆచూకీ దొరికింది. చిరుతపులిని బోనులో బంధించిన అటవీశాఖ అధికారులు నెహ్రూ జూ పార్కుకు తరలించనున్నారు. అక్కడి నుంచి చిరుత ఆరోగ్య పరిస్థితి చూసి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు తరలిస్తామని తెలిపారు.
అయితే చిరుత కోసం గాలిస్తున్న సమయంలో దానికి ఎరగా 5 మేకలను బోను వద్ద ఉంచారు అటవీ శాఖ అధికారులు. అయితే మేకలను చూసి కూడా చిరుత వాటి వద్దకు రాకపోవడం గమనార్హం. బోను వద్ద వరకూ వచ్చి తిరిగి వెళ్లడంతో ఇప్పట్లో చిరుత చిక్కకపోవచ్చని అధికారులు భావించారు. అయితే ఆశ్చర్యంగా గురువారం అర్ధరాత్రి సమయంలో చిరుత బోనులో చిక్కినట్లు అధికారులు తెలిపారు.