హైదరాబాద్ మహానగరం వేదికగా మరోసారి ఫార్ములా ఈ-రేస్ జరగనుంది. గతేడాది ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేస్ జరిగిన విషయం తెలిసిందే. ఏడాది తిరక్కముందే మరోసారి ఈ రేస్ నగరవాసులను పలకరించేందుకు వస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ హైదరాబాద్లో ఈ రేస్ జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఐఏ వరల్డ్ మోటార్ స్పోర్ట్ కౌన్సిల్ సమావేశంలో ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ సీజన్ 10 నిర్వహణకు ఆమోద ముద్ర వేశారు.
ఫార్ములా ఈ-రేస్ జరిగే సీజన్ 10 క్యాలెండర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సోషల్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. వచ్చే ఏడాది జనవరి 13వ తేదీ నుంచి జులై 21వ తేదీ వరకు ఫార్ములా ఈ రేస్ జరగనున్నట్లు పేర్కొన్నారు. మూడు ప్రధాన దేశాలైన చైనా, భారత్, USA లలో ఈ-రేసింగ్ జరుగనుందని వెల్లడించారు. జనవరి 13న మెక్సికోలో, జనవరి 26, 27న సౌదీ అరేబీయా, ఫిబ్రవరి 10న హైదరాబాద్ లో, మార్చి 16న బ్రెజిల‌్‌లో, మార్చి 30న జపాన్‌లో, ఏప్రీల్ 13న ఇటలీలో, ఏప్రీల్ 27న మోనాకో, మే 11,12 న జర్మనీ, మే25,26న చైనా, జూన్ 29న USAలో జూలై 20,21 న UKలో ఈ రేస్ లు జరగనున్నట్లు వెల్లడించారు.