రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల పలుచోట్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వాన వల్ల నాగర్‌కర్నూలు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని వనపట్లలో వర్షానికి మట్టిమిద్దె కూలి నలుగురు మృతి చెందారు. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో తల్లి పద్మ, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనలో తండ్రికి గాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకునే లోపే నలుగురు మరణించగా.. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. వాన వల్లే మిద్దె కూలిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మట్టి మిద్దె కావడం వల్ల రాత్రి కురిసిన వర్షానికి కూలిందని.. ఇళ్లు కూడా పురాతనమైంది కావడం వల్ల ఈ ఘటన జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. వర్షాకాలంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండకూడదని ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు సూచించారు.