కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు నిర్వహించిన సమావేశం ముగిసింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపైనే రేవంత్ రెడ్డి ప్రధానంగా అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. హామీలన్నీ అమలు కావాలంటే.. సంక్షేమం పూర్తి స్థాయిలో అసలైన లబ్ధిదారులకు చేరాలంటే ప్రజా ప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పని చేయాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. సచివాలయంలో తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులదేనని అన్నట్లు సమాచారం.
పోలీసులకు ఫుల్ పవర్ ఇచ్చామని.. భూ కబ్జాదారులు, అక్రమార్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలవద్దని సీఎం స్పష్టం చేశారు. ప్రజా పాలన పేరుతో ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయకపోతే టార్గెట్ రీచ్ కాలేమని సీఎం అధికారులతో అన్నట్లు తెలుస్తోంది. ప్రజాపాలన పేరుతో ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మ.2 గంటల వరకు, తిరిగి మ.1 నుంచి సా.5 గంటల వరకు సభలు నిర్వహించనున్నారు అధికారులు.