మహా నిమజ్జనానికి రంగం సిద్ధం.. 40 వేల మంది సిబ్బందితో భద్రత

-

మహాగణపతి నిమజ్జనానికి భాగ్యనగరం ముస్తాబైంది. గురువారం పదకొండో రోజు జరగనున్న నిమజ్జనాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లు, పదుల కొద్దీ జేసీబీలు, టిప్పర్లు, వేలాది మంది సిబ్బందితో నిమజ్జనానికి రంగం సిద్ధం చేశారు. మరో 100 చోట్ల నిమజ్జనాలు జరగనున్నాయని, అన్ని ప్రాంతాల్లో క్రేన్లు, ఇతర యంత్రాలు, సిబ్బందికి విధులు కేటాయించామని జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు.

మరోవైపు శోభాయాత్ర జరిగే రహదారుల పొడవునా పారిశుద్ధ్య కార్యక్రమాలు, బారికేడ్లు, సూచిక బోర్డులు, సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. నగరవ్యాప్తంగా 200 మంది గజ ఈతగాళ్లు.. సాగర్‌ చుట్టూ, పలు రహదారులపై వైద్య శిబిరాలు, 79 అగ్నిమాపకశాఖ వాహనాలను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. మరోవైపు 40 వేల మంది సిబ్బందితో అసాధారణ భద్రత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు.

నగరంలో మూడు కమిషనరేట్లలో కలిపి రికార్డు స్థాయిలో దాదాపు 40 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 25,694 మంది.. సైబరాబాద్‌, రాచకొండలో కలిపి 13 వేల మంది గస్తీలో పాల్గొననున్నారు. దాదాపు 48 గంటలపాటు సాగే ఉరేగింపు, నిమజ్జనంలో 20 వేలకుపైగా సీసీ కెమెరాలతో పరిస్థితిని అంచనా వేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news