హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. పదకొండో రోజైన నిన్న వేల సంఖ్యలో గణనాథులు గంగమ్మ ఒడికి చేరారు. హైదరాబాద్‌లో ఇవాళ కూడా నిమజ్జనం కొనసాగుతోంది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు వేల వాహనాలు క్యూ కట్టాయి. గణనాథుల నిమజ్జనంతో హుస్సేన్‌సాగర్ పరిసరాలు కోలాహలంగా మారాయి.
నగరంలోని పలు ప్రాంతాల నుంచి గణనాథులు తరలివస్తున్నారు. వేల మంది భక్తులతో ట్యాంక్‌బండ్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. డప్పు చప్పుళ్లు, డీజే పాటలు, మేళ తాళాలు, యువత స్టెప్పులతో ట్యాంక్ బండ్ పరిసరాలు సందడిగా మారాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు గణేశ్ నిమజ్జనాలు కొనసాగనున్నాయి. నిమజ్జనోత్సవం చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు.
గణేశ్ నిమజ్జనంలో ఎలాంటి అపశ్రుతి చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. గణేశ్ నిమజ్జనానికి తీసుకువచ్చే మార్గాల్లో సీసీటీవీ నిఘా ఉంచారు. సీసీటీవీ నిఘాలో.. పోలీసుల పటిష్ఠ పహారా మధ్య.. భాగ్యనగరంలో గణపయ్య నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.