హైదరాబాద్ నానక్రామ్గూడలో గాంజా విక్రయిస్తున్న మహిళ నీతూబాయిని టీఎస్‌న్యాబ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. డెకాయ్ ఆపరేషన్లో భాగంగా బుధవారం రోజున నీతూబాయి, ఆమె భర్త మున్నుసింగ్(53), సమీప బంధువులు సురేఖ(38), మమత (50)తోపాటు 13 మంది గంజాయి వినియోగదారులు వెరసి మొత్తం 17మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.
నీతూబాయి బ్యాంకు ఖాతాల్లో రూ.1.63 కోట్ల నగదు, హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో రూ.2 కోట్ల విలువైన స్థిరాస్థులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబం ఎనిమిదేళ్లలో ఇంత సంపాదించినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. అరెస్టయిన వారి నుంచి 22.6 కిలోల గంజాయి, 2 ఫోన్లు, రూ.22.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. నీతూబాయి, మున్నుసింగ్, ఇతర కుటుంబసభ్యులు తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు గంజాయి విక్రయాలు మొదలుపెట్టారు. కిలో గంజాయి విక్రయాలతో రూ.50వేలు వంతు సంపాదిస్తున్నారు. ఖరీదైన ప్రాంతాల్లో ఇళ్లు, స్థిర, చరాస్థులు కొనుగోలు చేశారు.