తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. 9.81 లక్షలమంది పరీక్షలకు హాజరయ్యారని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి తెలిపారు. ప్రథమ సంవత్సరం 4.78 లక్షలమంది, సెకండియర్‌కు 5.2 లక్షలమంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు వెల్లడించారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 2.87 లక్షలమంది, ద్వితీయ సంవత్సరంలో 3.22 లక్షలమంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో 60.01 శాతం, ద్వితీయ సంవత్సర పరీక్షల్లో 64.19 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెంకటేశం తెలిపారు. ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారని చెప్పారు. ఫస్టియర్ ఫలితాల్లో 68.35 శాతం బాలికలు, 51.5 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించగా.. సెకండియర్ ఫలితాల్లో 72.53 శాతం బాలికలు, 56.1 శాతం బాలురు పాస్ అయ్యారు. ఇంటర్మీడియెట్ ఫలితాలు tsbie.cgg.gov.in, results.cgg.gov.inలో చెక్ చేసుకోవచ్చు.