రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు రాష్ట్రంలోని చెరువులు, వాగులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఓవైపు రాష్ట్రంలో కురుస్తున్న వానలు, మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ఈరోజు ఉదయం 6 గంటలకు గోదావరి నీటిమట్టం 46.50 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ఆదివారం సాయంత్రం గోదావరి నీటిమట్టం 43 అడుగులకు పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరితే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో దిగువ ప్రాంతాల ఉన్న విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విలీనం మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి మురుమూరు గ్రామం వద్ద వరద నీరు రోడ్డుపైకి రావడంతో భద్రాచలం నుంచి కూనవరం విఆర్ పురం చింతూరు మండలాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.