నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. ఇవాళ పార్లమెంటులో కేంద్రం ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనుంది. మంగళవారం రోజున కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2024-25 ఆర్థిక ఏడాదిలో మిగిలిన 8 నెలలకు పద్దును ప్రవేశపెడతారు. ఈ సమావేశాల్లో 6 బిల్లులను సభ ఆమోదం కోసం కేంద్రం తీసుకురానుంది. మరోవైపు నీట్ పేపర్ లీకేజీ, కావడి యాత్ర వివాదాలపై కేంద్రాన్ని విపక్షం నిలదీయనుంది.
మరోవైపు సంప్రదాయాన్ని అనుసరించి డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలని ఆదివారం నాటి అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బడ్జెట్ సమావేశాల కార్యాచరణపై చర్చించేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ప్రభుత్వం దీనిని నిర్వహించింది. ఇంటర్నెట్‌ను ప్రజలందరికి ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలనే ప్రైవేటు మెంబర్ బిల్లును పరిగణనలో తీసుకునేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఉన్నత న్యాయస్థానాల విశ్రాంత న్యాయమూర్తులు రాజకీయాల్లోకి రావడం, కృత్రిమ మేధ, డీప్‌ఫేక్, పౌరసత్వ సవరణ చట్టంపైనా ఇలాంటి 23 బిల్లుల్ని రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.