తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. సీఎం విదేశీ విద్య పథకం కింద ఫాల్ సీజన్ కోసం మైనారిటీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ telanganaepass.cgg.gov.in లో డిసెంబర్ 01 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ యాస్మిన్ బాషా తెలిపారు. యునైటేడ్ స్టేట్స్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ దేశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్ డీ కోర్సులు అభ్యసిస్తున్న వారు ఈ పథకానికి అర్హులు. ఈ స్కీమ్ కి ఎంపికైన విద్యార్థులకు రూ.20లక్షల స్కాలర్ షిప్ తో పాటు ఫ్లైట్ టికెట్ చార్జీలు అందజేస్తారు.
ఈ స్కాలర్ షిప్ కు అర్హత సాధించాలంటే డిగ్రీ, బీటెక్ లో 60 శాతం స్కోర్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేట్ రికార్డు ఎగ్జామినేషన్ లేదా గ్యాడ్యుయేట్ మేనేజ్ మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంగ్లీషు లాంగ్వేజ్ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. ఒక కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే ఈ స్కాలర్ షిప్ మంజూరు చేస్తారు. దరఖాస్తు చేసే అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.5లక్షలు లోపు మాత్రమే ఉండాలి.