తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త అనే చెప్పాలి. టీజీఆర్టీసీ యాజమాన్యం 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ చేసింది. ఈ బస్సులు దశల వారిగా వివిధ రూట్లలో రోడ్డెక్కనున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులను, 13 చార్జింగ్ స్టేషన్లను సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన నడవనున్నాయి. ఈ 1000 బస్సుల్లో హైదరాబాద్ లోని HCU, హయత్ నగర్ వంటి డిపోల పరిధిలోని డిజీల్ బస్సుల స్థానంలో నడుపనున్నట్టు సమాచారం.
ఈ డీజిల్ బస్సులను గ్రామీణ ప్రాంతాలకు కేటాయించనున్నారు. మిగతా 500 ఎలక్ట్రిక్ బస్సులను వరంగల్, నల్గొండ, సూర్యపేట, కరీంనగర్, నిజామాబాద్ వంటి అధిక ట్రాఫిక్ రూట్లలో నడపునున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 100 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది టీజీఆర్టీసీ. ఎలక్ట్రిక్ బస్సులకు రీచార్జ్ చేసుకునేందుకు అనుగుణంగా పలు డిపోల వద్ద చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. MGBS, JBS, BHEL, HCU, హయత్ నగర్ 2, రాణీగంజ్, కూకట్ పల్లి, హైదరాబాద్ 2, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ వంటి పలు డిపోలలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.