ఇటీవల రైల్వే శాఖను తరచూ ప్రమాదాలు చుట్టుముడుతున్నాయి. ఒడిశాలో ఇటీవలే మూడు రైళ్లు ఢీ కొన్ని ఘటన దేశంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఒడిశా, మధ్య ప్రదేశ్, తమిళనాడు, ఏపీలో మరికొన్ని రైలు ప్రమాద ఘటనలు.. కొన్ని త్రుటిలో ప్రమాదం తప్పిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ రైల్వే శాఖలో లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి.
ఇక తాజాగా తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో భారీ రైలు ప్రమాదం తప్పింది. కేసముద్రం-ఇంటికన్నె స్టేషన్ల మధ్య తెగిపోయిన గూడ్స్ రైలు లింక్ తెగిపోయింది. విజయవాడ వైపు నుంచి కాజీపేట వైపు వెళ్లే గూడ్స్ రైలు బోగీలు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ శివారులో విడిపోయాయి. వెంటనే అప్రమత్తమైన గార్డ్… గూడ్స్ రైలు డ్రైవర్‌కు సమాచారం అందించారు. డ్రైవర్ వెంటనే గూడ్స్ రైలును నిలిపివేసి వెనుకకు వచ్చి విడిపోయిన గూడ్స్ బోగీలను తగిలించుకొని వెళ్లిపోయాడు. గార్డు అప్రమత్తంగా ఉండటం… విడిపోయిన గూడ్స్ బోగీలు పట్టాలు తప్పకపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లైంది.