రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ను సందర్శించి ఫ్లాట్ ఫాం లలో ఉన్న మహిళా ప్రయాణీకులకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో మరింతగా రాణించాలన్నారు. వారి అభిరుచి మేరకే ప్రభుత్వం సంక్షేమ పథకాలు రూపొందించి అందించడం జరుగుతుందని అన్నారు.
రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే కార్యక్రమానికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ఆర్టీసీ బస్సులలో తెలంగాణాలో ఇప్పటి వరకు 150 కోట్ల మహిళలు సుమారు రూ.5 వేల కోట్ల విలువైన ఉచిత ప్రయాణాలు వినియోగించుకున్నారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. బస్టాండ్ లోని ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో మహిళా అధికారులు, సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రయాణికులకు గులాబి పూలు, స్వీట్స్ ఇచ్చి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.