తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇటీవల రాష్ట్ర కేబినెట్ సమావేశంలో జీవో నెంబర్ 111 ను రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజా గా జీవో నెంబర్ 111 ను రద్దు చేస్తు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా ఉత్తర్వలను కూడా జారీ చేసింది. జీవో 111 అమల్లో ఉన్న గ్రామాల్లో ఆంక్షలను పూర్తిగా ఎత్తివేశారు. దీని కోసం రాష్ట్ర పురపాలక శాఖ జీవో నెంబర్ 69 ఉత్తర్వులను జారీ చేసింది. అయితే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల్లో నీటి నాణ్యత దెబ్బతిన కుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం షరతు విధించింది.
అందు కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతుంది. అలాగే జలాశయాల్లోకి నీరు వెళ్లేలా.. డైవర్షన్ ఛానళ్లను కూడా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతుంది. దీని కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ కూడా వేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉండగా.. గతంలో జీవో నెంబర్ 111 ను రద్దు చేయాలని ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీని ప్రకారమే.. సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.