గత కొంతకాలంగా తెలంగాణ గవర్నర్, ప్రభుత్వానికి మధ్య ఉన్న విభేదాలు ఈ గణతంత్ర వేడుకల సందర్భంగా తారాస్థాయికి చేరాయి. ఈ శాసనసభ సమావేశాలనూ గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు మొదలుపెట్టాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. మరోవైపు బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతించకపోవడంతో ఇరువురూ కోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన సర్కార్.. గవర్నర్ ప్రసంగం ఉంటుందని ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. రెండేళ్ల అనంతరం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. ఉభయసభల సంయుక్త సమావేశంతో రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
రేపటి కోసం బడ్జెట్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాజ్‌భవన్‌కు పంపింది. అయితే దానికి గవర్నర్ ఇంకా ఆమోదముద్ర వేయలేదన్న ప్రచారం ఉంది. అసలే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం ఎలా ఉండబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన మేరకే వుంటుందన్న అంచనా మేరకే గవర్నర్ నడుచుకుంటారా లేదా పోయినసారి లేవనెత్తినట్టు సొంతంగా మరికొన్ని అంశాల ప్రస్తావన చేస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.
బడ్జెట్ లో రాష్ట్రానికి సరైన కేటాయింపులు చేయకపోవడం.. తెలంగాణపై కేంద్రం చిన్నచూపు వంటి అంశాలు కచ్చితంగా గవర్నర్ ప్రసంగంలో చేర్చే అవకాశముందని సమాచారం. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆ ప్రసంగాన్ని చదువుతారా.. లేదా మరోసారి వివాదాలకు తెరతీస్తారా అనే అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.