తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. హనుమకొండ జవహర్‌నగర్‌లో వరద ప్రాంతాన్ని పరిశీలించిన గవర్నర్ బాధితులను పరామర్శించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో హెల్త్ కిట్స్, నిత్యావసర సరకులను బాధితులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. వర్షాన్ని, వరదలను నియంత్రించలేమని.. కానీ ముంపును ముందుగానే పసిగట్టి తగిన అప్రమత్త చర్యలు తీసుకోవచ్చని అన్నారు. ఇలాంటి పరిస్థితికి గల కారణాలపై దృష్టి సారించాలని చెప్పారు. భవిష్యత్తులో ఈ పరిస్థితి తలెత్తకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని గవర్నర్ తమిళిసై సూచించారు. వరదల తర్వాత తలెత్తే సమస్యల పట్ల అధికార యంత్రాంగంగ అప్రమత్తంగా ఉండాలని తమిళిసై కోరారు. వరదలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారిందని ప్రభావిత ప్రాంతాలన్నింటిలోనూ ప్రభుత్వం వెంటనే ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. వరదల తర్వాత మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని.. వరదలు తగ్గాయని వదిలేయకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.