నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ : నేడో, రేపో గ్రూపు-1 నోటిఫికేషన్‌

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగాల తొలి నోటిఫికేషన్ జారీకి సర్వం సిద్ధమైంది. నేడు లేదా రేపు దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. శనివారం ఇదే అంశంపై టిఎస్పిఎస్సి కీలక సమావేశం కూడా నిర్వహించింది.

19 ప్రభుత్వ శాఖల్లోని 503 ఖాళీల భర్తీపై అందిన ప్రతిపాదనలు అన్నిటినీ బోర్డు క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదం తెలిపింది. ఆయా పోస్టులకు విద్యార్హత, వయసు తదితర అంశాలను పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించింది.

మరో మూడు అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సి ఉంది. గతంలో గ్రూప్-1 కేటగిరిలో లేని విభాగాల పోస్టులను ఈసారి దాని పరిధిలోకి చేర్చారు. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర కేడర్ పోస్టులు మల్టీ జోనల్ స్థాయి మారాయి. అలాగే ఇంటర్వ్యూ లు ఎత్తి వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో గ్రూప్ వన్ పరీక్ష విధానంలో మార్పులు జరిగాయి. రాత పరీక్ష లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది.