తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో రేపటి నుంచి ఆంజనేయ స్మామి జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 14వరకు జరగనున్న ఈ వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 3 లక్షల మంది అంజన్న మాలధారులు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ఈ ఉత్సవాల్లో దాదాపు మూడు లక్షల మంది మాలధారులు దీక్షవిరమణ చేయనున్నట్లు సమాచారం. స్వామివారి అభిషేకం, సహస్ర నామార్చనతో ఉత్సవాలు ప్రారంభం కానుండగా లోకకల్యాణార్థం రోజూ హోమం జరుపనున్నారు. స్వామికి సమర్పించే పట్టువస్త్రాలను నేతన్నలతో ఆలయంలోనే నేయిస్తున్నారు. మరోవైపు భక్తుల కోసం ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది.
మరోవైపు హనుమాన్ జయంతి ఏర్పాట్లలో జాప్యంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవాలకు కేవలం ఒక్కరోజు మాత్రమే ఉండగా ఇప్పటికీ ఆలయానికి రంగులు, ముఖద్వారాల అలంకరణ పూర్తి కాలేదని వాపోతున్నారు. కోనేరులో జల్లు స్నానాల కోసం గతంలో అమర్చిన పైపులకు నల్లాలు బిగించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు కనీస వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.