మెదక్​ నుంచే కేసీఆర్ ప్రగతి శంఖారావం పూరిస్తారు : మంత్రి హరీశ్ రావు

-

ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రోజున మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా.. కేసీఆర్ కలెక్టరేట్‌, ఎస్పీ, బీఆర్ఎస్ కార్యాలయాలను ప్రారంభిస్తారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆసరా పింఛను పెంపును మెదక్‌ నుంచి కేసీఆర్‌ ప్రారంభిస్తారని చెప్పారు. ఆ వేదిక నుంచే దివ్యాంగులకు ఆసరా పింఛను రూ.4,016కు పెంచుతారని వెల్లడించారు. మధ్యాహ్నం 3.30కు కేసీఆర్‌ బహిరంగ సభ ఉంటుందని హరీశ్ రావు వివరించారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అన్ని స్థానాలు గెలుస్తామని మంత్రి హరీశ్‌ రావు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి క్యాడర్ లేదని.. కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుంటోందని మండిపడ్డారు. మరోవైపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఈసారి గెలిచి హ్యాట్రిక్​ సీఎంగా చరిత్ర సృష్టిస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో.. బీఆర్ఎస్ అభ్యర్థులు విజయఢంకా మోగించడం ఖాయమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల విజయ శంఖారావాన్ని మెదక్ సభ నుంచే సీఎం కేసీఆర్ పూరిస్తారని మంత్రి హరీశ్ రావు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news