రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీల అమలుపై ముఖ్యమంత్రికి సవాల్ విసిరిన బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు గన్‌పార్కు వద్ద ప్రమాణానికి బయలుదేరారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి రాజీనామా పత్రంతో హరీశ్‌రావు నాంపల్లిలోని అమరవీరు స్తూపం వద్దకు వెళ్లారు. తన ఎమ్మెల్యే పదవి కంటే ప్రజలకు మేలు జరిగితే మంచిదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణం చేసి తన చిత్తశుద్ధి చాటుకోవాలని హితవు పలికారు.
పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేస్తామని లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారని, అప్పటిలోగా రైతు రుణమాఫీ చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని హరీశ్‌రావు.. సీఎంకు సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామా పత్రం సిద్ధంగా ఉండాలని సూచించడంతో తాను రెడీగా ఉన్నానని చెప్పిన హరీశ్ గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్దకు రావాలని చెప్పారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ, 6 హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తానని… రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణానికి రావాలని సీఎంకు సవాల్ విసిరారు.