అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు పునరుద్ఘాటించారు. సీఎం కేసీఆర్ రాజీలేని పాలన సాగిస్తున్నారని తెలిపారు. కేంద్ర ఇచ్చే అవార్డుల్లో రాష్ట్రం అవార్డుల పంట పండిస్తోందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దరిదాపుల్లో ఏ రాష్ట్రం లేదని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన 90 శాతం హమీలు అమలు చేశామని.. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా రైతు బంధు, రైతు బీమా వంటి కర్షక సంక్షేమ పథకాలు అమలు చేశామని వెల్లడించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.
పట్టణాల్లో ఉండే సౌకర్యాలు అన్నీ గ్రామాల్లో అభివృద్ధి చేశాం. కేసీఆర్ విజన్ కారణంగానే విద్యుత్ కొరతను అధిగమించాం. కోతలు లేకుండా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కర్ణాటకలో ప్రస్తుతం రైతులకు 2 గంటల కరెంట్ కూడా ఇవ్వలేదు. పక్క రాష్ట్రాలకు అన్నంపెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారింది. అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.