ఈ ఎన్నికల్లోనూ బీజేపీకి ఒకే సీటు వస్తుంది : హరీశ్ రావు

-

ఓటు అంటే ఐదేళ్ల భవిష్యత్‌ అని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది ఒక సీటేనని.. ఈ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ఒక సీటే వస్తుందని తెలిపారు. ఒక సీటు వచ్చే బీజేపీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రజల సమస్యలు తీర్చలేవని చెప్పారు. దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన హరీశ్ రావు.. గతంలో దుబ్బాక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నెరవేరాయా? అని ప్రశ్నించారు. బీజేపీని నమ్మితే ఆగం అవుతారని పేర్కొన్నారు.

“బీజేపీ ఆచరణ సాధ్యం కాని హామీలను ఇస్తుంది. మళ్లీ బీఆర్ఎస్ వస్తే భూములు లాక్కొంటారు అని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. మళ్లీ బీఆర్ఎస్ వస్తే అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం. కేసీఆర్‌ అంటే నమ్మకం. బీజేపీ వస్తే బోరుబావులకు మీటర్లు వస్తాయని గత ఎన్నికల్లో చెప్పాం. మీటర్లు పెట్టలేదని కేంద్రం రూ.25 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వలేదు. మీటర్లు, బిల్లు లేకుండా రైతులకు 24 గంటల కరెంట్‌ ఇస్తున్నాం. గతంలో ఇచ్చిన హామీలను కేసీఆర్‌ నెరవేర్చారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పింఛను రూ.5వేలకు పెంచుతాం. బీడీ కార్మికులపై కేంద్రం జీఎస్టీ వేసింది. బీడీ కార్మికులకు పింఛను ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వం ఆదుకుంది.” అని హరీశ్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version