ప్రసాదంపై జీఎస్టీ మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం లోక్‌సభలో జరిగిన ఆర్థిక బిల్లు 2025పై చర్చలో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రకటనలు చేసిన నిర్మలమ్మ.. ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో విక్రయించే ప్రసాదాలకు ఎలాంటి జీఎస్టీ వర్తించదని స్పష్టం చేశారు. అలాగే ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను కూడా రద్దు చేయనున్నట్లు తెలిపారు.
నూతన ఆదాయపు పన్ను బిల్లును తదుపరి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చకు తీసుకొస్తామని నిర్మలమ్మ వెల్లడించారు. ఫిబ్రవరి 13వ తేదీన కొత్త ఐటీ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లును ఆ తర్వాత సెలెక్ట్ కమిటీకి పంపించారు. ఆ కమిటీ దీనిపై అధ్యయనం చేస్తోంది. ఈ కమిటీ వచ్చే పార్లమెంట్ సమావేశాల తొలి రోజు నాటికి నివేదికను సమర్పించనుంది. అందువల్ల దీనిపై వర్షాకాల సమావేశాల్లో చర్చ చేపడుతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.