ప్రాజెక్టుల అప్పగింత నిజం కాకపోతే ప్రభుత్వం ఎందుకు వివరణ ఇవ్వలేదు ? : హరీశ్ రావు

-

సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వితండవాదం తప్ప మరేమి లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆయన తమ నాయకుడు కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేది లేదని రంకెలేస్తున్న ప్రభుత్వం.. కేఆర్‌ఎంబీ సమావేశంలో ప్రాజెక్టులను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆ వార్తలు తప్పయితే ప్రభుత్వం ఎందుకు వివరణ ఇవ్వలేదని నిలదీశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్ రావు ధ్వజమెత్తారు.

దిల్లీలోని జలశక్తి భవన్‌లో జనవరి 17న కేఆర్‌ఎంబీ సమావేశం జరిగింది. కేంద్రం ఇచ్చిన మినిట్స్‌లో నెల రోజుల్లోపు 15 అవుట్‌లెట్స్‌ను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తామని చెప్పారు. తెలంగాణ, ఏపీ అధికారులు ఎవరైనా డ్యామ్‌పైకి వెళ్లాలంటే కేఆర్‌ఎంబీ అనుమతి తీసుకోవాలి. నిర్వహణ బాధ్యతను కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు అధికారులు ఒప్పుకున్నారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించారని పత్రికలు వార్తలు రాశాయి. వార్తలు తప్పు అయితే ప్రభుత్వం ఎందుకు వివరణ ఇవ్వలేదు. నేను మీడియా సమావేశం పెట్టాక ప్రభుత్వం దిల్లీకి లేఖ రాసింది. ఫిబ్రవరి 1న కేఆర్‌ఎంబీ రెండో మీటింగ్‌ జరిగింది. పవర్‌ హౌజ్‌ అవుట్‌లెట్లు ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతి కావాలని ఈఎన్‌సీ చెప్పారు. ప్రాజెక్టులు అప్పగించేది నిజం కాకపోతే.. ఉద్యోగుల జీతాల ప్రస్తావన ఎందుకు వస్తుంది? అని హరీశ్ రావు నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news