జీతాలివ్వడానికి చాలా కష్టపడుతున్నాం.. బైజూస్ సీఈవో రవీంద్రన్

-

ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి కొన్ని నెలలుగా పర్వతాలను కదిలించినంతగా కష్టపడుతున్నట్లు బైజూస్‌ సీఈవో రవీంద్రన్ అన్నారు. జనవరి నెలకు సంబంధించిన వేతనాలను చెల్లించడానికి మరింతగా పోరాడాల్సి వచ్చిందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు ఒక లేఖ రాశారు.

“ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ త్యాగాలు, ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ యుద్ధంలో అందరూ ఎంతో కొంత అలసిపోయినా, ఎవరూ మధ్యలో నిష్క్రమించ లేదు . మనం నిర్మించుకున్న దానిపై మనకున్న నమ్మకమే దీనికి కారణం. ఆత్మగౌరవం ఉంటే అన్నీ ఉన్నట్లే” అని ఉద్యోగులకు రాసిన లేఖలో రవీంద్రన్ పేర్కొన్నారు.

ఉద్యోగుల జీతాల కోసం బైజూస్‌ సంస్థ నెలకు దాదాపు 70 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీఈఓ రవీంద్రన్‌ను తొలగించేందుకు ఇన్వెస్టర్లంతా ఏకమయ్యారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇన్వెస్టర్లకు అలాంటి హక్కు లేదని బైజూస్‌ ఆ వార్తలను ఖండించింది. రుణాలు, వడ్డీల చెల్లింపులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రవీంద్రన్ గతంలో ఉద్యోగుల వేతనాలు చెల్లించడానికి తమ కుటుంబానికి చెందిన ఇంటిని తాకట్టు పెట్టిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news