రాష్ట్రం గొంతెండుతోంది.. గుక్కెడు నీళ్లైనా ఇయ్యుండ్రి : హరీశ్ రావు

-

రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పులు, ప్రస్తుత ప్రభుత్వం వైఫల్యాలపై పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో నీటి సమస్యపై మరోసారి రేవంత్ సర్కార్ను ప్రశ్నించారు.

రాష్ట్రం గొంతెండిపోతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. నీళ్ల కోసం ప్రజలు రోడ్లెక్కుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు. ఖాళీ బిందెలతో ధర్నాలు.. ట్యాంకర్ల కోసం ఎదురు చూపులు మళ్లీ మొదలయ్యాయని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి దృశ్యాలు ఎప్పుడూ కనిపించలేదని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయన్న హరీశ్‌రావు.. బీఆర్ఎస్ హయాంలో తండాల్లోనూ మిషన్ భగీరథ జలధార వచ్చేదని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పంటలకు సాగు నీళ్లు ఎలాగూ ఇవ్వలేదన్న హరీశ్‌ రావు.. కనీసం ప్రజలకు మంచినీళ్లైనా ఇవ్వాలని కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version