10 మంది పోలీసులను సర్వీస్ నుండి తొలగించడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరితే 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హేయమైన చర్య.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. “నేను పోలీసు కుటుంబం నుండి వచ్చిన. పోలీసుల కష్టాలు నాకు తెలుసు.
ఇంట్లో భార్య, బిడ్డలు పడే బాధ నాకు తెలుసు” అంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక పోలీసుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు? వారి ఆవేదన ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? అంటూ ఫైర్ అయ్యారు. అధికారం లేకుంటే ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాటనా? అని మండిపడ్డారు. భేషజాలు పక్కన పెట్టి.. టీజీఎస్పీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, 10 మందిని ఉద్యోగం నుండి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించువాలని డిమాండ్ చేశారు. సస్పెండ్ చేసిన 39 మంది కానిస్టేబుళ్లను కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.