మేం అరెస్టులు చేసుంటే సగం కాంగ్రెస్‌ నేతలు జైల్లోనే ఉండేవారు : హరీశ్‌రావు

-

తాము అధికారంలో ఉన్నప్పుడు అరెస్టులు చేసి ఉంటే సగం కాంగ్రెస్ నాయకులు  జైళ్లోనే ఉండేవారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షతన ఇవాళ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభకు హరీశ్​రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. పనితనం తప్ప పగతనం తెలియని నాయకుడు కేసీఆర్ అని హరీశ్​రావు కొనియాడారు. కేసీఆర్​ నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలను, అవసరాలను తీర్చి కడుపులో పెట్టుకొని చూసుకున్నది బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు.

ప్రజల పక్షాన పోరాటం చేసి, ప్రజల కోసం పనిచేశామని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ వాళ్లు గోబెల్స్ ప్రచారం చేశారని, బీఆర్ఎస్ చేసిన కృషి నిలకడ మీద తెలుస్తుందని  స్పష్టం చేశారు. నర్సాపూర్ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని నిరూపించారని, ఇక్కడ గెలిచిన పార్టీ రాష్ట్రంలో గెలవనందుకు బాధగా ఉందని తెలిపారు.

“ఇవాళ పార్లమెంట్‌లో జరిగిన ఘటన బాధాకరం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. మాటలు ఘనంగా ఉండటం కాదు చేతలు కూడా ఘనంగా ఉండాలి.” అని కేంద్ర సర్కారుపై మాజీ మంత్రి హరీశ్ రావు నిట్టూర్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version