తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు జోరు సాగిస్తున్నారు. బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాలు, రోడ్ షోలు, మీట్ ది ప్రెస్ వంటి కార్యక్రమాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొమ్మిదన్నరేళ్లలో తెలంగాణ అభివృద్ధిపై ఆయన మాట్లాడారు. అనంతరం విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ఈ క్రమంలో.. ‘ఇప్పటి వరకు నీటిపారుదల , వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల బాధ్యతలు తీసుకున్న మీరు.. మీకు ఎంచుకునే ఛాన్స్ ఇస్తే ఏ శాఖను ఎంచుకుంటారు’ అని ఓ విలేకరి ప్రశ్నించగా హరీశ్ రావు వైద్య ఆరోగ్య శాఖను ఎంచుకుంటానని సమాధానం ఇచ్చారు. ఆరోగ్య శాఖ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆ శాఖ బాధ్యత తీసుకోవడం చాలా సవాలుతో కూడుకున్నదని చెప్పారు. ఎంతో మంది ప్రాణాలు ఆ శాఖ మీద ఆధార పడి ఉంటాయని తెలిపారు. ఆ శాఖలో చేయడానికి చాలా పని ఉంటుందని.. అందుకే ఆ శాఖ బాధ్యత తీసుకోవడం తనకు ఇష్టమని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.