హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై మరోసారి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇవాళ ఉదయం ఈ మార్గంలో రద్దీ నెలకొంది. ఓవైపు ఇప్పటికే జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రోజూ వివిధ సమయాల్లో కాసేపు ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఇక తాజాగా ఆ రహదారిపై ట్రక్కు బోల్తా పడటంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రద్దీ నెలకొంది.
హయత్ నగర్ నుంచి లక్ష్మారెడ్డిపాలెం వరకు వాహనాలు స్తంభించాయి. దీంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రహదారిపై ట్రక్కును తొలగించి రాకపోకలను ట్రాఫిక్ సిబ్బంది పునరుద్ధరిస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు కాస్త సమయం పడుతుందని అధికారులు చెప్పారు. అయితే వాహనదారులు మాత్రం తమ పనులపై వెళ్లేందుకు ఆలస్యం అవుతోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
‘ఈ మార్గంలో నేను రోజు ఆఫీసుకు వెళ్తున్నాను. ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నట్టున్నాయి. దాని వల్ల రోజూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఆఫీసుకు వెళ్లేందుకు గంట ముందే బయల్దేరినా.. ఆలస్యం అవుతోంద’ని ఓ వాహనదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు.