ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ఛార్జీల వసూళ్లపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అపోలో, బసవతారకం ఆస్పత్రులు ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయన్న విశ్రాంత ఉద్యోగి ఓఎం దేబరా దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. కొందరు పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న షరతులతో ప్రభుత్వం రాయితీతో భూమి కేటాయించిందని పిటిషనర్ పేర్కొన్నారు.
అపోలో, బసవ తారకం ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం ఇవ్వడం లేదని వెల్లడించారు. షరతులు ఉల్లంఘిస్తే భూములు ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అధిక బిల్లులు చెల్లించకపోతే మృతదేహం కూడా అప్పగించడం లేదని పేర్కొంది. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని హై కోర్ట్ తెలిపింది. లైసెన్సులు రద్దు చేస్తే సరిపోదని.. భూములు వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది. అపోలో, బసవ తారకం ఆస్పత్రులపై విచారణ జరిపి వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.