బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న కేసీఆర్ ఇప్పటి వరకు 94 సభల్లో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత సీఎం కేసీఆర్.. అక్టోబర్ 15వ తేదీన ఎన్నికల ప్రచారం షురూ చేశారు. ఇక మేనిఫెస్టో ప్రకటించిన అదే రోజు హుస్నాబాద్ సభలో పాల్గొన్నారు. అప్పటినుంచి రోజుకు మూడు నాలుగు.. ఒక్కోసారి ఐదు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ఈనెల 25న జీహెచ్ఎంసీ ప్రాంతానికి సంబంధించి పరేడ్ గ్రౌండ్స్‌లో జరగాల్సిన సభ వర్షం కారణంగా రద్దయింది. ఈ క్రమంలో నిన్నటి వరకు మొత్తం 94 సభల్లో పాల్గొన్నారు. ఇవాళ వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు ఉమ్మడిగా జరగనున్న సభలో పాల్గొననున్నారు. ఆ తర్వాత చివరగా గజ్వేల్‌లో బీఆర్ఎస్ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ ఫుల్స్టాప్ పెట్టనున్నారు. ఇవాళ్టితో కలిపి సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో పాల్గొన్న సభల సంఖ్య మొత్తం 96 అవుతుంది. మొత్తంగా 22 నియోజకవర్గాలు మినహా… 97 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం చేశారు.