కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలను దక్కించుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలు, రికార్డులు, ఉత్తర్వులు సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను, న్యాయ నిపుణులను అప్రమత్తం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సాగునీటి పరిస్థతి, కృష్ణా గోదావరి జలాలపై ఉన్న అంతరాష్ట్ర వివాదాలు, నీటి వాటాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
రాష్ట్ర పునర్వవ్యస్తీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల నీటి వాటాలు, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను బ్రజేష్కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంది. ట్రిబ్యునల్ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభిప్రాయాలను, ఆధారాలను మాత్రమే సేకరించింది. త్వరలోనే ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాల్సి ఉంటుందని, ఆ తర్వాత ట్రిబ్యునల్ నిర్ణయం వెలువడుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించి ఇప్పటివరకు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులు, ఏయే ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లను ఇప్పటికే ట్రిబ్యునల్కు సమర్పించారు.. జలశక్తి మంత్రిత్వ శాఖకు ఇచ్చిన నివేదికలన్నింటినీ వరుస క్రమంలో సిద్ధంగా ఉంచుకోవాలని, వాటి ఆధారంగా ట్రిబ్యునల్ ఎదుట పకడ్బందీగా వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.