తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం ముగిసింది. మరో 24 గంటల్లో పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ 24 గంటల వ్యవధి చాలా కీలకమైనది. ఈ సమయంలోనే డబ్బు కట్టలు విచ్చలవిడిగా పంపిణీ జరుగుతాయి. మద్యం ఏరులై పారుతుంది. అందుకే పోలీసులు పటిష్ఠ నిఘా పెట్టారు. ఎన్నికల వేళ ప్రలోభాలపై ప్రత్యక దృష్టి సారించారు. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మరుక్షణం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపడుతున్న పోలీసులు.. ఇప్పుడు మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పంపిణీ చేసే వస్తు సామగ్రిని నిలువరించేందుకు వాణిజ్య పన్నుల శాఖ 240 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. మరోవైపు అక్రమ మద్యం రవాణాను నిలువరించేందుకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆరోజు నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ రూ.737 కోట్ల 29 లక్షలు. ఇందులో నగదు అక్షరాలా 301 కోట్ల 93 లక్షలు. అక్రమ సరఫరా ద్వారా పట్టుబడిన మద్యం రెండు లక్షల 53వేల లీటర్లు.