ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని పలు పుణ్యక్షేత్రాలు భక్తులతో సందడిగా మారాయి. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు పూర్తయినా గత కొన్ని రోజుల నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో వర్షాలు కురవనుండటంతో ఇప్పుడే మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఇవాళ (జూన్ 16వ తేదీ 2024) తెల్లవారుజాము నుంచే సీతారాముల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో కదిలి రావడంతో ఆలయ ప్రాంతాలన్నీ కిటకిటలాడుతున్నాయి. సర్వదర్శనంతో పాటు ప్రత్యేక దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సందర్భంగా ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల మూలవరులకు ఆలయ అర్చకులు విశేష అభిషేకం నిర్వహించారు. బేడా మండపంలో జరిగే నిత్య కళ్యాణ వేడుకలో దంపతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.