ఆ విషయాల్లో భారత్‌తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో

-

భారత్‌ – కెనడా సంబంధాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇరు దేశాధినేతలు జీ7 సమావేశాల సందర్భంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. ముఖ్యమైన అంశాలపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన సున్నితమైన అంశాల వివరాల జోలికి నేను వెళ్లడం లేదని ట్రూడో పేర్కొన్నారు. కానీ, కలిసి పని చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. భవిష్యత్తులో చాలా ముఖ్యమైన పనులను కలిసి డీల్‌ చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు శుక్రవారం రోజున ప్రధాని మోదీ తాను ట్రూడోతో కరచాలనం చేస్తున్న ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ‘‘కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోను జీ7 సదస్సులో కలిశాను’’ అంటూ దానికి క్యాప్షన్‌ జత చేశారు. మరోవైపు కెనడా ప్రధాని కార్యాలయం కూడా దీనిపై స్పందించింది. ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలపై సంక్షిప్తంగా చర్చించారని పేర్కొంది. మోదీ తిరిగి ప్రధానిగా ఎన్నిక కావటంతో ట్రూడో శుభాకాంక్షలు తెలిపారని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news