హైదరాబాద్ ప్రగతినగర్‌లోని అపార్టుమెంట్ ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు మిథున్‌రెడ్డి నాలాలో పడి మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసిన అధికారులకు విస్తుపోయే విషయం తెలిసింది. తాజాగా ఈ ప్రమాదానికి కారణమైన అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్, కాలనీ అసోసియేషన్ ప్రతినిధిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బాలుడి పోస్టుమార్టం కోసం పోలీసులు 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన రోజు ఉదయం సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన అధికారులు ప్రమాదానికి గల కారణాలను గుర్తించారు. మంగళవారం ఉదయం 8.20 గంటలకు అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ మ్యాన్ హోల్ ఓపెన్ చేశాడని.. రోడ్డుపై నిలిచిన వరదనీరు మళ్లించేందుకు కాలనీ అసోసియేషన్ ప్రతినిధి వాచ్‌మెన్‌తో మ్యాన్ హోల్ మూత తీయిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయని పోలీసులు తెలిపారు. మూత పక్కకు తీసి మ్యాన్ హోల్ వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల అపార్ట్‌మెంట్ వద్ద ఆడుకుంటున్న మిథున్‌రెడ్డి నాలాలో పడిపోయాడని వెల్లడించారు.