తెలంగాణపై వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. ఏకధారగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షం.. ప్రజలను జడిపిస్తోంది. ముంపు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనేక చోట్ల పల్లెల మధ్య రాకపోకలు స్తంభించగా, రహదారులు కొట్టుకుపోయాయి.. రాష్ట్రంలో 14 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 11 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో శనివారం నాటికి 106.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు లేవని వాతావరణ శాఖ ప్రకటించింది. మొత్తానికి శనివారం కురిసిన భారీ వర్షానికి రాష్ట్రవ్యాప్త జనజీవనం అతలాకుతలమైంది.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో సోమ, మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 3.1 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంలో తీవ్రత ఎక్కువగా గ్రేటర్ పరిధిలోనే ఉందని, అందుకే ఈ నెలలో ఆ ప్రాంతంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయని తెలిపారు.