హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు మెట్రో రాయితీలను మరో ఆరు నెలలపాటు పొడిగిస్తున్నట్లు తెలిపింది. సెలవు రోజుల్లో 59 రూపాయలకే ప్రయాణ సదుపాయం కల్పించే సూపర్ సేవర్ మెట్రో హాలీడే కార్డుతోపాటు, రద్దీ లేని సమయాల్లో ప్రయాణ ఛార్జీల్లో 10 శాతం రాయితీ ఇచ్చే సూపర్ ఆఫ్ పీక్ అవర్ సహా మెట్రో స్టూడెంట్ పాస్‌లపై రాయితీలను మరో ఆరు నెలలపాటు పొడిగిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
వాస్తవానికి మార్చి 31వ తేదీతో ఈ కార్డులను మెట్రో అధికారులు రద్దు చేశారు. అయితే రాయితీలు రద్దు చేయడంతో ప్రయాణికులు నిరాశ చెందారు. వేసవిలో మెట్రో ప్రయాణం సులువుగా ఉంటుందని, ఎక్కువ మంది ప్రయాణించే వీలుంటుందని మెట్రో సంస్థ దృష్టికి తీసుకువెళ్లారు. రాయితీలు మరికొద్ది రోజుల పాటు పొడిగించాలని ఒత్తిడి రావడంతో స్పందించిన మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉగాది కానుకగా మళ్లీ ఆ కార్డులను పునరుద్దరిస్తున్నట్లు తెలిపారు. ఈ రాయితీలను పొడిగించడం ద్వారా మెట్రో ప్రయాణాన్ని మరింత పెంచాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు. ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.