తెలంగాణలో ఓవైపు ఎండలు దంచికొడుతున్నాయి. వడగాలులు ప్రజలను అల్లాడిస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా వాతావరణం ఉంది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తాజాగా వాతావరణ శాఖ అధికారులు చల్లటి కబురు చెప్పారు. రాగల మూడు రోజులు అంటే మంగళవారం నుంచి పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఈ మూడు రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు తెలిపారు.
గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నాయని, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, జోగులాంబ గద్వాల, జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో వడగాల్పులు వీస్తున్నాయని పేర్కొంది. నిన్న రాష్ట్రంలో అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.