హైదరాబాద్‌లో ఒకప్పుడు అడుగు బయట పెట్టాలంటే నగర వాసులు భయపడేవారు. దానికి కారణం ట్రాఫిక్. భారీ ట్రాఫిక్‌తో ఓ చోటు నుంచి మరో చోటుకు వెళ్లాలంటే గంటలు గంటలు పట్టేది. కానీ ఇప్పుడు ఫ్లై ఓవర్లు, ఫూట్ ఓవర్లు, స్కై వాకులు, మెట్రో వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గి.. సుదూర ప్రయాణాలకు కూడా తక్కువ సమయంలో వెళ్లగలుగుతున్నారు. ముఖ్యంగా మెట్రో వచ్చినప్పటి నుంచి నగర వాసులకు ప్రయాణ కష్టాలు తప్పాయి.
అందుకే హైదరాబాద్ మెట్రో వరుసగా రికార్డులు సృష్టిస్తోంది. మెట్రో రైళ్లలో రోజురోజుకు రద్దీ గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రయాణికుల విషయంలో హైదరాబాద్ మెట్రో ఇప్పటికే పలు రికార్డులు సాధించింది. ఇక తాజాగా ఒకే రోజు 5.47 లక్షల మంది మూడు కారిడార్‌లలో ఉన్న మెట్రో మార్గాల్లో రాకపోకలు సాగించారు. మెట్రో సేవలు ప్రారంభమైన ఆరేళ్లలో ఒక్కరోజులో ప్రయాణికుల సంఖ్య 5.5 లక్షలు చేరువలో ఉండటం ఇదే మొదటిసారి అని మెట్రో అధికారులు చెబుతున్నారు.