హైదరాబాద్‌లో గణపతి నిమజ్జనాలకు రంగం సిద్ధమైంది. వినాయక నిమజ్జనోత్సవాలను కన్నులపండువగా జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నారు. హుస్సేన్‌సాగర్ వద్ద ప్రశాంతంగా నిర్వహించేలా పోలీసులు చర్యలు చేపట్టారు. జంటనగరాల పరిధిలో 40 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు చేపట్టారు. నిమజ్జనం సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని ప్రజలు సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు.
మరోవైపు గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఇవాళ మెట్రో రైళ్లు అర్ధరాత్రి 2 గంటల వరకు నడపనున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. చివరి స్టేషన్లలో అర్ధరాత్రి 1 గంటకు చివరి రైలు బయలుదేరుతుంది. రాత్రి 2 గంటలకు చివరి స్టేషన్ చేరుకుంటుంది. అవసరాన్ని బట్టి అదనపు రైళ్లు నడపాలని హైదరాబాద్ మెట్రో నిర్ణయించింది. డిమాండ్‌ను బట్టి కొన్ని మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయనుంది. అర్ధరాత్రి వరకు సర్వీసుల దృష్ట్యా మెట్రో స్టేషన్లలో భద్రత పెంచారు. ఖైరతాబాద్, లక్డీకపూల్ స్టేషన్లలో అదనపు పోలీసులు మోహరించారు. వారితో పాటు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. ఈనెల 29న యథాతథంగా ఉదయం 6 నుంచి మెట్రో సర్వీసులు నడవనున్నాయి.