చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంతో పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

-

హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. స్టేషన్ లోని ఐదో ప్లాట్ ఫామ్ పైకి వచ్చిన రైలు ఆగే సమయంలో అక్కడి డెడ్ ఎండ్ వాల్ ను ఢీ కొట్టింది. ఒక్కసారిగా రైలు కుదుపునకు గురి కావడంతో మూడు బోగీలు పట్టాలు తప్పి పాక్షికంగా దెబ్బ తిన్నాయి. ఆ బోగీల్లో ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్‌లో పలు ఎంఎంటీఎస్‌ రైళ్లను అధికారులు రద్దు చేశారు.

నాంపల్లి – మేడ్చల్ మార్గంలో ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల రోజూ ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎప్పటి వరకు రైల్ సర్వీసులను సస్పెండ్ చేశారో తెలియకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. వీలైనంత త్వరగా సర్వీసులు పునరుద్ధరించాలని కోరుతున్నారు.

మరోవైపు చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై రైల్వేశాఖ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version