పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న రాహిల్ తండ్రి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ పోలీసులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డిసెంబర్‌లో రోడ్డు ప్రమాద ఘటన తర్వాత పోలీసు అధికారులతో కలిసి కేసును తప్పుదోవ పట్టించిన రాహిల్ దుబాయ్ పారిపోయాడని అందుకు పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
ఈ వ్యవహారంలో ఇప్పటివరకూ 15 మందిని అరెస్టు చేయగా…. కేసులో అతని తండ్రి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సైతం నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. ఘటన జరిగిన రోజు పోలీసు అధికారులను ప్రభావితం చేసిన షకీల్…. అతని కుమారుడిని కాపాడుకునే ప్రయత్నం చేశాడనీ వెల్లడించారు. మరోవైపు పోలీసులపై నిరాధార, ఊహాజనిత వ్యాఖ్యలు చేసిన షకీల్‌పై సైతం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసులు స్పష్టం చేశారు.
రాహిల్పై ఉన్న కేసులపై దర్యాప్తు చేస్తున్న సమయంలో ఆయన తండ్రి షకీల్ ఓ వీడియో విడుదల చేశారు. దర్యాప్తు అధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తూ వీడియోలో ప్రస్తావించారు. మతపరమైన, రాజకీయపరమైన ఇతర సూచనలతో చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాం. కేసులో నిందితులుగా ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దర్యాప్తును తప్పుపట్టేలా నిరాధార, ఉహాజనిత వ్యాఖ్యలు చేసిన వారిపైనా. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.