హైదరాబాద్‌లో ఒక్కసారి వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. బలమైన గాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. మరికొన్ని చోట్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, షేక్‌పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్, అమీర్‌పేట, రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్‌పురా, ఎస్సార్‌నగర్, ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, లంగర్‌హౌస్, గండిపేట్, శివరాంపల్లి, ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్, బీఎన్‌రెడ్డినగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది.
దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. గంటపాటు భారీగా వాన కురవడంతో నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. వరద నీరంతా రోడ్లపైకి చేరి చెరువులను తలపించాయి. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాహనదారులు తడిసిముద్దయ్యారు. మరోవైపు టోలిచౌకిలో భారీ చెట్టు కూలడంతో కొమ్మలు విరిగిపడి వ్యక్తికి గాయాలయ్యాయి. 4 బైకులు ధ్వంసం అయ్యాయి.