తెలంగాణలో ఎడతెరిపి వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వాసులను వర్షాలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. కాలు బయట పెడదామంటే వరద ముంచెత్తుతోంది. ఇక భారీ వర్షాలకు నగరంలోని నాలాలు ఉప్పొంగి రోడ్లపైకి వరద నీరు చేరింది. చాలాచోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు వర్షాల వల్ల భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.
ఇవాళ కూడా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. మున్నేరు వాగు ఉద్ధృతితో కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్ సమీపంలోని ఐతవరం వద్ద గురువారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయమూ అదే పరిస్థితి కొనసాగింది. సుమారు 2 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. హైవే పై వాహనాలను పలు మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం మున్నేరుకు 1,92,000 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో వాహనదారులు గంటలకొద్ది ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.